సంక్షోభంలో జీవవైవిధ్య సంపద ఎందుకు? I "Biodiversity on the Brink: A Global Crisis in the Making"


    ప్రకృతిలో ఏ జీవి ఒంటరిగా జీవించలేదు . ప్రతి ప్రాణి తన చుట్టూ ఉన్న పరిసరాలపై , ఇతర జీవరాశులపై ఆవాసం ఆహారం ప్రత్యుత్పత్తిల కోసం ఆధారపడుతుంది . ప్రకృతిలో  మానవునితో సహా జీవులన్నీఎన్నో భేదాలను కలిగి ఉండి కూడా   పరస్పరాధారిత జీవనం గడుపుతాయి . జీవులలో గల భేదాలన్నిటిని కలిపి జీవవైవిధ్యం ( బయో డైవర్సిటి ) అని పిలుస్తారు .   ఇది భవిష్యత్ తరాలకు ఉమ్మడి ఆస్థి. మానవునికి ఆహారం ఆరోగ్యంలతో పాటు ఆర్థిక సామజిక నైతిక రసాత్మాక విలువలను పెంపోందిస్తుంది.నేడు అభివృద్ది  ఆధునికత  సాంకేతికతల పేరుతో మానవుడు మితిమీరిన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిలోని వివిధరకాలైన జీవుల వినాశనానికి పాల్పడుతున్నాడు .  భూమిపై విపరీత వాతావరణ మార్పులు , భూతాపం , భూఅతిచల్లదనం , భారి అగ్నిపర్వతాల పేలుడు , గ్రహశకలాలు డీకోట్టడం వంటి కారణాల వల్ల ఇప్పటికే భూమిపై సుదీర్ఘ కాలవ్యవధులలో ఐదు మహాజీవ అంతర్ధాన సంఘటనలు జరిగాయి. ఈ సాముహిక జీవవినాశన ప్రక్రియలలో భూమిపై గల జీవులలలో ప్రతిసారి మూడొంతులకు పైగా జీవులు కనుమరుగు అయినాయి . సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఐదవమహావిలుప్తంలో డైనోసార్లు అంతరించి  పోవడం అనేది భూమిపై సమీపకాలంలో జరిగిన సాముహిక జీవవినాశన సంఘటన . ఇప్పుడు మనం హలోసీన్ అంతర్ధానంగా పిలిచే అరవ మహాజీవ అంతర్ధానప్రక్రియలో జీవిస్తున్నామని  జీవవైవిధ్యంపై అద్యయనం చేస్తున్న అమెరికన్ ఆవరణ  శాస్త్రవేత్త రాబర్ట్ కోవి తాజాగా పేర్కొన్నాడు . మానవుని మతిమాలిన ప్రకృతి విరుద్ద చర్యలే దీనికి కారణమని ఆందోళన వ్యక్తం అవుతున్నది .

  భూమిపై సమస్త జీవుల సంరక్షణ , ప్రజలలో జీవవైవిధ్య  అవగాహనా కార్యక్రమాల అమలుకు  ప్రతి సంవత్సరం మే 22 న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ( ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయో డైవర్సిటీ )  నిర్వహించాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు  ప్రపంచ  దేశాలు  జీవవైవిధ్య  సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి . గత ఏడాది  ప్రణాళికలో భాగం అవ్వండి  అనే ప్రధాన ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను నిర్వహించినాయి   . ఈ సంవత్సరం 2025  మే 22 అంతర్జాతీయజీవవైవిధ్య దినోత్సవం ను పురస్కరించుకొని ‘ ప్రకృతితో సామరస్యం మరియు స్థిరమైన అభివృద్ధి ‘  అనే నినాదంతో ప్రపంచదేశాలన్నీ  నిర్వహించుకొంటున్నాయి  . 2024  అక్టోబర్ లో కొలంబియాలో పాజ్ కాన్ లా నేచురా లేజా ( ప్రకృతితో శాంతి ) అనే నినాదంతో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ( కాప్-16 ) జరిగింది . జీవవైవిధ్యం స్థిరమైన భూమినిర్వహణ ఎడారీకరణ అంశాలు ప్రధానఎజెండాగా 2025 లో ఆర్మేనియాలో  యూఎన్ఓ అధ్వర్యంలో అంతర్జాతీయ జీవవైవిధ్య  రోడ్ మ్యాప్ సదస్సు ( కాప్-17 ) జరుగనున్నది . వాతావరణ మార్పులు పరజతుల దాడి సహజవనరుల అతిదోపిడి కాలుష్యం పట్టణీకరణ అడవుల నరికివేత  అను అంశాలు  జీవవైవిధ్య సంక్షోభానికి ప్రధాన చోదకాలుగా పనిచేస్తాయని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు .         


సంక్షోభంలో జీవవైవిధ్యం :  

    భూమిపై సుమారు 54 లక్షల క్రితం జరిగిన కేంబ్రియన్ పేలుడు  ద్వారా జీవవైవిధ్యవృద్ది వేగవంతమైంది . ప్రస్తుతం    భూమిపై పై సుమారు 1 కోటి 40 లక్షల జాతులున్నట్లు  శాస్త్రవేత్తల అంచనా  . వీటిలో ఇప్పటివరకు సుమారు   80 లక్షల జాతులు మాత్రమే గుర్తించబడినవి . భూమిపై  అసాధారణ వాతావరణ మార్పులు వరదలు తీవ్రమైన తుఫానులు భూతాపం పారిశ్రామికీకరణ మైనింగ్, విచ్చలవిడిగాఅడవుల నరికివేత , కొన్ని ప్రాంతాల్లో అతిచల్లధనం అంటువ్యాధులతో పాటు అధిక జనాభా మరియు అధికసాగుబడి అను అంశాలు   జీవవైవిధ్యం దెబ్బతినడానికి  ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును . ప్రస్తుతం   ప్రపంచవ్యాప్తంగా ప్రతి  సంవత్సరం 10 వేల జీవజాతులు అంతరించిపోతున్నట్లు ప్రముఖ అమెరికన్ సోషియో బయాలజిస్ట్  డాక్టర్ ఎడ్వర్డ్ ఓ విల్సన్ పేర్కొన్నారు .19వ శతాబ్దంతో పోలిస్తే ఒక్క 20 వ శతాబ్దంలోనే దాదాపు 543 సకశేరుక జాతులు కనుమరుగయినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి .  గత 50 ఏండ్ల కాలం నుండి సకశేరుకాలు సగటున 69% మేరకు తగ్గిపోయాయని ప్రస్తుతం 35 వేల జాతులు అంతరించే దశలో ఉన్నాయని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్  నేచర్ తన తాజా  లివింగ్ ప్లానేట్ రిపోర్ట్ లో  తెలిపింది .

   భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.4  శాతం మాత్రమే కలిగిఉంది . కానీ   జీవవైవిద్యంలో 8.1 శాతం కలిగిఉంది . కావున మనదేశం ప్రపంచంలోని 12 మెగా జీవవైవిధ్య దేశాలలో ఒకటిగా ఉంది .ఇప్పటివరకు సుమారు18లక్షలజీవజాతులు గుర్తించబడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి . ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జీవవైవిధ్య సంపన్నత ఉన్న 35 గ్లోబల్ హాట్ స్పాట్లలో మన దేశంలో  పశ్చిమకనుమలు , హిమాలయాలు , ఇండో –బర్మన్ ప్రాంతం మరియు నికోబార్ దీవులు అను 4 హాట్ స్పాట్లు  ఉన్నాయి . ఆదివాసులైన  గిరిజనులు కొండజాతి ప్రజలు ఎక్కువగా ఉన్న మేఘాలయ నాగాలాండ్ , మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ లలో జీవవైవిధ్యం ఎక్కువగా పదిలంగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి . జీవవైవిధ్యంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ -2021 నివేదిక ప్రకారం  మనదేశంలో 1 లక్షకు పైగా  జంతుజాతులు  55 వేలకు పైగా  మొక్కల జాతులు ఉన్నాయి .  70% చేపలు అంతరించే దశలో 57% ఉభయచరాలు కనుమరుయ్యే దశలో 7% పక్షులు అంతరించే దశలో ఉన్నాయని, ప్రతి ఏటా 1500 వృక్ష జాతులు పలు కారణాలతో  చనిపోతున్నాయని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ పేర్కొంది . ఇండియన్ రెడ్ డాటా లిస్ట్ 2021-22 ప్రకారం మనదేశంలో పులి  సింహం  చిరుత  ఒంటికొమ్ము రైనో  గబ్బిలం  డోడో పక్షి  నెమలి  రివర్ డాల్ఫిన్  రెడ్ పాండా  రాబందు  ఏనుగు  పిచ్చుక  రాక్ క్యాట్  ఎగిరేఉడుత  సాలీడు  ఎలుగుబంటి  అడవికోతి గబ్బిలాలు  తదితర జంతువులు మరియు వేప  సైకస్  క్లేవియర్ , ఆర్కిడ్ చెట్లు తదితర జీవులు  సమీప భవిష్యత్తులో  అంతరించే దశలో ఉన్నాయి . జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ , చిరుత పునరావాసం , ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ లయన్ బిగ్ క్యాట్ అలయెన్స్ ప్రాజెక్ట్ డాల్పిన్ మరియు మిష్టి వంటి ఎన్నో పతకాలను చట్టాలను  అమలు చేస్తూ మనదేశం  ప్రపంచదేశాల్లో ముందున్నది .  


జీవసంరక్షణలో భవిష్యత్ దృక్పధం :

    జీవవైవిధ్య పరిరక్షణ కోసం రియోడిజనిరో  సదస్సు-1992 మొదలు కున్మింగ్-మాంట్రియల్ సదస్సు-2022   వరకు  నిర్దేశించుకున్న 23 కార్యాచరణ లక్ష్యాలలో ఏవి కూడా   ఇప్పటి వరకు పూర్తిస్థాయిలోనెరవేరలేదు.  2030 నాటికి భూభాగం సాధారణజలాలు తీరప్రాంతాలు సముద్రాలలో కనీసం 30 శాతాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు  కాప్-15 సదస్సులో  ఆమోదించిన  ‘ 30 బై 30 ప్రణాళిక ‘ ను ఖచ్చితంగా  అమలుపరచాలి  . 2050 నాటికి పూర్తి లక్ష్యాలను సాధించాలి .  2024 లో జరిగిన  అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ( కాప్-16 )లో గత ఫ్రేమ్ వర్క్ లోని లక్ష్యాల సాధనకు నడుంకట్టాలి . అత్యధిక కర్బన ఉధ్ఘారీత ధనిక దేశాలు పేదదేశాలకిచ్చే 200 బిలియన్ల యూఎస్ డాలర్ల ఆర్థిక సహాయం సముద్రంలో చుక్క అని అభివృద్ధి చెందుచున్న దేశాలు పెదవి విరుస్తున్నాయి  . కావున ఆర్థిక సాయాన్ని భారీగా  పెంచాలి . బయో డైవర్సిటి ఇన్ఫర్మేషన్ ఫెసిలిటి ద్వార ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవవైవిద్య డేటాను సమగ్రపరచడానికి మరియు విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలి . అంతరించే జాతులను సంరక్షించడానికి రక్షిత ప్రాంతాలలో ఏఐ-ఆధారిత నిఘావ్యవస్థలను ఏర్పాటుచేయాలి .

  అటవీభూముల పర్యవేక్షణ పునరుద్దరించడంలో నేల నాణ్యత  వాతావరణ పరిస్థితులకు  చెందినసమాచారాన్ని విశ్లేషించడంలో వన్య ప్రాణుల  సంరక్షణలో వాటి సంఖ్యను అంచనా వేయడంలో  ఏఐతో పాటు మెషిన్ లర్నింగ్ సేవలను వినియోగించాలి .   క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అంతరించిపోతున్న వృక్ష జంతు జాతులను  పునరుద్దరించాలి . పురుగుమందుల వినియోగాన్ని 50% తగ్గించాలి . వన్యప్రాణి పర్యావరణ జీవవైవిధ్యరక్షణ చట్టాలను పటిష్టంగా అమలుపరచాలి . గ్రామస్థాయి జీవవైవిధ్య నిర్వహణ కమిటీలను చైతన్యవంతం చేయాలి .  వ్యవసాయం  వినియోగం వ్యర్థాల్లో తగ్గింపులు , సహకార నీటినిర్వహణలో సాంకేతిక సేవల ఉపయోగం పెరగాలి  . భూమిపై 2030 నాటికి 300 కోట్ల లక్షలకు పైగా చెట్లను నాటే గ్రీన్ వరల్డ్ పథకాన్ని  చేపట్టాలి .  మనం ఇప్పుడు భూగ్రహంపై కోడ్ రెడ్ స్థితిలో ఉన్నామనే  ప్రపంచ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికల నేపధ్యంలో జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందాలను కార్యాచరణ దిశగా ముందుకు  తీసుకెళ్ళడంతోనే  జీవవైవిధ్య సంక్షోభాన్ని నివారించగలుగుతాము .  ప్రపంచ పౌరులందరిలో లర్నింగ్ ఫర్ నేచర్ అనే తాత్విక చింతనను పెంపొందించి నప్పుడే భూమిపై జీవ సంపన్నత పరిడవిల్లుతుంది .

 

   వ్యాస రచయిత :

డాక్టర్ భారత రవీందర్

 ( 22 మే  అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా  )

Comments

Popular posts from this blog

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

"జపాన్ బాబా వంగా" భవిష్యవాణి ప్రపంచాన్ని ఎందుకు కదిలించింది? I Why the “Japan’s Baba Vanga” Prediction Shook the World ? I Bharatha Sudarshan, Socio-Political Analyst

"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?