’ఆపరేషన్ సిందూర్’ ఎవరి కోసం? ఎందుకోసం? I Operation Sindoor: For Whom? For What?
‘ఆపరేషన్ సిందూర్’ పేరు నేడు ప్రపంచమంతా ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. శాంతి కాముకంగా, సహనానికి ప్రతీకగా నిలిచిన భారతదేశం తన ప్రజల భద్రత కోసం మరో చరిత్రకు నాంది పలికింది. దేశభక్తితో నిండిన ఒక చారిత్రక అధ్యాయాన్ని లిఖిస్తున్నది. దాయాది పాకిస్థాన్ నుంచి వచ్చిన అనూహ్య ఉగ్రవాద దాడులకు ధీటుగా స్పందిస్తూ భారత ప్రభుత్వం ఈ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం సరిగ్గా మే 7, 2025 తేదీన పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి వాటిని తుత్తునియలు చేసింది. ఈ ఆపరేషన్ 22 ఏప్రిల్, 2025న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగింది. కశ్మీర్ లోని పహెల్గాంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చిన 25 మంది భారత పర్యాటకులు, ఒక నేపాలీ దేశస్థుడిని ఉగ్రవాదులు దుర్మార్గంగా కాల్చి చంపారు. వీరిలో చాలామంది హిందూ పురుషులు లక్ష్యంగా చంపబడ్డారు. ఈ ఆపరేషన్ కేవలం సైనిక చర్య కాదు, భారతదేశ ధర్మం, సంస్కృతి మరియు సార్వభౌమత్వాన్ని కాపాడే పవిత్ర యుద్ధంగా భావించాలి.
ఎవరి కోసం ఈ ఆపరేషన్?
ఈ ఆపరేషన్ భారత్ సమగ్రత కోసం. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాదు. ఇది మన సైనికుల ధైర్యానికి, ప్రజల ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక. ‘ఆపరేషన్ సిందూర్’ పహల్గాం బాధితుల కుటుంబాల కోసం, దేశ పౌరుల భద్రత కోసం మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క సంకల్పాన్ని చాటడం కోసం రూపొందించబడింది. ‘సిందూర్’ అనే పేరు హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే పవిత్ర చిహ్నం. ఇది బాధిత కుటుంబాల ఆవేదనను, దేశం యొక్క గాయాన్ని సూచిస్తుంది. ఈ ఆపరేషన్ ‘జైష్-ఎ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా’ వంటి ఉగ్రవాద సంస్థల నాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఆ ఉగ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంఘాలు భారతదేశంలోని పలు ప్రదేశాల్లో దాడులకు తెగబడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భారత గూఢాచారి సంస్థ ‘రా’ (RAW – Research and Analysis Wing) కు సమాచారం అందినట్లుగా సమాచారం. ఈ ఆపరేషన్ భారత సైన్యం యొక్క శక్తిని, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ను మరియు దేశ ధర్మాన్ని పరిరక్షించే సంకల్పాన్ని ప్రపంచానికి చాటింది. ఈ చర్య ద్వారా భారతదేశం తన పౌరుల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకోగల సామర్థ్యాన్ని నిరూపించింది.
ఎందుకోసం ఈ సిందూర్?
భారత్ ఎల్లప్పుడూ శాంతికి ప్రాధాన్యతనిస్తుంది. కానీ శాంతిని తప్పుగా, అసమర్ధతగా అనుకుని, ధైర్యాన్ని సవాలు చేసిన పక్షానికి సరైన గుణపాఠం చెబుతామన్న సంకల్పం కోసమే ఈ యుద్దం. ఇది బలవంతంగా చేయబడతున్న యుద్ధం. పహల్గాం దాడి తర్వాత, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్ తన సార్వభౌమత్వాన్ని, పౌరుల భద్రతను కాపాడేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ ను చేపట్టింది. బహవల్పూర్, మురిద్కే, ముజప్ఫరాబాద్ వంటి ప్రాంతాల్లోని ఉగ్ర స్ధావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 17 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 60 మంది గాయపడ్డారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ చర్యలు ‘‘కేంద్రీకృత, అనుపాత, అనవసర ఉద్రిక్తత లేని’’ విధంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో భారత్ అత్యాధునిక డ్రోన్లు, లేజర్ – గైడెడ్ మిసైల్స్ మరియు సాటిలైట్ ఇమేజరీని ఉపయోగించింది. ఇది దేశ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదంతో జరిగిన ఈ ఆపరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క ‘జీరో టోలరెన్స్ (శూన్య సహనం)’ విధానాన్ని తెలియజేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ ఈ దాడులను ఖండిస్తూ అంతర్జాతీయ వేదికలపై ఫిర్యాదు చేసింది, కానీ భారత్ తన చర్యలను సమర్ధిస్తూ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఆధారాలను ఐక్యరాజ్య సమితికి సమర్పించింది. ఈ ఆపరేషన్ తర్వాత, భారత్ జమ్మూ కశ్మీర్ లో భద్రతను మరింత బలోపేతం చేసింది. సరిహద్దు వెంట డ్రోన్ నిఘాను పెంచింది. సోషల్ మీడియాలో #OperationSindoor హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. దేశవ్యాప్తంగా యువత ఈ చర్యను సమర్ధిస్తూ ర్యాలీలు నిర్వహించారు. అంతర్జాతీయంగా అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉగ్రవాదంపై భారత్ దృక్పథాన్ని సమర్ధించాయి. అయితే చైనా సన్నాయి నొక్కులు నొక్కుతుండగా, టర్కీ మాత్రం పాకిస్థాన్ కు మద్దతు పలికాయి. ఈ ఆపరేషన్ భారతదేశ రాజకీయ, సైనిక శక్తిని నిరూపించింది. అదే సమయంలో దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయాలను మరింత ఉద్విగ్నం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ప్రజల ర్యాలీలు ఈ ఆపరేషన్ దేశంలో ఉత్సాహాన్ని, ఐక్యతను నింపినట్లు చూపించాయి. ఉదయం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా హైవిజిబిలిటీ మిలిటరీ మూవ్ మెంట్స్, మీడియా బులెటిన్లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ టాగ్స్ అన్నీ ఒకే నినాదాన్ని ప్రతిధ్వనించాయి – ఆ నినాదమే ‘‘భారత్ సిద్ధం అయింది!’’.
ఈ ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య కాదు. ఇది భారతదేశం, దేశ ప్రజల యొక్క గర్వం. బాధితులకు న్యాయం మరియు భవిష్యత్ దాడులను నిరోధించే హెచ్చరిక. ఇది భారత్ యొక్క ఉక్కు శక్తి సంకల్పం మరియు ధర్మ పరిరక్షణను ప్రపంచానికి చాటిచెబుతున్నది. భారత్ ఎప్పుడూ ధర్మపరాయణ దేశం. శాంతి కోసం తపించేది, కానీ అవసరమైతే అర్థరాత్రికైనా ఖడ్గం దూస్తుంది. ధర్మ యుద్ధం అనేది అవసరం అయితే తక్షణమే చేయాల్సిన కర్తవ్యం. అదే భారత తత్వం. అందుకే..
‘‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’’
- భారత సుదర్శన్,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
#OperationSindoor #PahalgamAttack #IndianArmy #AntiTerrorism #IndiaStrikesBack #PakistanTerror #NationalSecurity #JaiHind #ModiGovernment #SindoorSymbolism #TerroristCamps #PrecisionStrikes #ViralNews #BharatMataKiJai #DharmaYuddha #BharathaSudharshan #Analyst #Journalist
(మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో షేర్ చేయండి!)
Comments
Post a Comment