హరిత పర్యావరణవాదమే శ్రేయస్కరం

 

అనాది నుండి  మానవుడు పర్యావరణ స్పృహ కలిగియుండి ప్రకృతితో  మమేకమై జీవిస్తు ఉండేవాడు  . కానీ నేడు మనిషి  శాస్త్ర సాంకేతిక పరిశోధనలు నూతన ఆవిష్కరణలతో ప్రకృతి గోళాన్ని మరిచి విజ్ఞానగోళంలో విహరిస్తున్నాడు . సకల జీవరాశుల ఉమ్మడి ప్రయోజనాలను మరచి అభివృద్ధి ఆధునికతల జీవనశైలి  మాటున అత్యాశ అవసరాలు తీర్చుకోవడానికి సహజ వనరులను విద్గ్వంసం చేస్తూ   పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోతున్నాడు .  భూఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్ళెం వేయాలన్న పారిస్ ఒప్పందం అమలు ఎండమావిగానే మిగిలిపోతున్నది .  ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు 1972లో స్టాక్‌హోమ్‌ ( స్వీడన్ ) లో యూఎన్ఓ అధ్వర్యంలో జరిగిన మానవుడు- పర్యావరణం  అంతర్జాతీయ సదస్సు లో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ) ను  జరుపుకోవాలని సభ్యదేశాలు  నిర్ణయించాయి  . మొట్టమొదట  1973 జూన్ 5 "ఒకే ఒక భూమి" అనే నినాదంతో  ప్రపంచ పర్యావరణ దినమును  ప్రపంచదేశాలన్నీ జరుపుకున్నాయి.  ఈ సంవత్సరం 2025 జూన్ 5న “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి “ ( బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ) అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాము . ఈ ఏడాది 52 ప్రపంచ పర్యావరణ వేడుకలకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశం అతిధ్యమివ్వనున్నది . మన దేశంలోఒక రోజు ముందుగానే  వన్ నేషన్- వన్ మిషన్ – ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్  అనే నినాదంతో భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది . ఈ ప్రచారం భారత దేశం యొక్క ప్రధానపర్యావరణ చొరవగా పరిగణించబడుతుంది . పర్యావరణ సానుకూల  జీవనశైలి ( మిషన్ లైఫ్ ) తో అనుసంధానించబడిన పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరత్వం పట్ల భారతదేశం యొక్క అచంచలమైన నిబద్దతను ఈ నినాదం ప్రతిబింభిస్తుంది .   వాతావరణచర్య మహాసముద్రాలరక్షణ పర్యావరణ వ్యవస్థల మరమ్మతులు జీవవైవిధ్యాన్ని నిలుపుకోవడం స్థిరమైన ఉత్పత్తి వినియోగం వంటి సుస్థిరాభివృద్ది లక్ష్యాలను సాధించడంలో పర్యావరణ సంక్షోభాన్ని నివారించడంలో  ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం ఒక ముఖ్యమైన సహకారంగా పనిచేస్తుంది . నేటి   పర్యావరణ సంక్షోభానికి స్తూలంగా  వాతావరణ మార్పు , మహమ్మారి వ్యాధుల వ్యాప్తి మరియు సాంకేతిక దండయాత్ర అను మూడు ప్రధాన కారణాలుగా  ఉన్నవి  .

 

పర్యావరణసంక్షోభంలో మానవుడు :

ప్రకృతి నియమాలకు విరుద్ధంగా అడవులను విచక్షణారహితంగా నరికివేయడం కాలుష్యం గ్రీన్‌హౌస్ వాయువులఉద్గారాలు రేడియోధార్మికవ్యర్థాలు భూవినియోగ విధానాల్లో మార్పులు మరియు భూకంపాలు , సునామీలు అగ్నిపర్వతాల భారీవిస్ఫోటనాలు భూతాపం  ఎల్ నినో లానినా , భూఅతిశీతల ప్రభావం ( గ్లోబల్ డిమ్మింగ్ ) హీట్ వేవ్స్ వంటి ప్రకృతి  వైపరిత్యాలతో పాటు    విషవాయువుల లీకేజీ అణుపేలుళ్లు వ్యవసాయంలో  అపరిమిత రసాయనఎరువులు పురుగుమందుల వినియోగం , గాలి నీరు భూమి కాలుష్యాల తీవ్రత   వంటి నిర్లక్ష్యపు చర్యలు  భూమిపై వేగవంతమైన పర్యావరణ  విధ్వంసానికి  కారణమవుతున్నాయి. భూతాపం  కారణంగా మంచు హిమనినదాలు కరుగడం వల్ల తీరప్రాంత దేశాలలో మిలియన్ల మంది ప్రజలు పర్యావరణ శరణార్థులుగా మారుతారు .  ఋతువులు గతి తప్పుతున్నాయి . మండుటెండలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి . నదులు ఎండిపోయి నీరు దొరకదు . తీవ్రమైన  వరదలు , వర్షాలు కలుగుతున్నాయి . కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.

                      వాతావరణ మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం భూమి నుండి  సుమారు పదివేల  జీవ జాతులు అదృశ్యమవుతున్నాయి . ప్రముఖ అమెరికన్ పర్యావరణవేత్త డా. షన్నాస్వాన్ తన తాజాపుస్తకం కౌంట్ డౌన్ లో పేర్కొన్నట్లు   మనం నిత్యం ఉపయోగించే ఉత్పత్తులలో పాలీఫ్లోరోఅల్కైల్స్ థాలేట్స్ మరియు బిస్ఫినాల్ వంటి ప్లాస్టిక్ విష రసాయనాల కాలుష్యం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం (ఫెర్టిలిటీ కెపాసిటీ )  మానవులలో తగ్గిపోయి   2045 నాటికి మానవ మనుగడకు ముప్పు ఏర్పడనున్నది  . 21వ శతాబ్దంలో బయోటెక్ మరియు ఇన్ఫోటెక్ కలయిక వల్ల ఎదురయ్యే సవాళ్లలో భాగంగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ డేటాసైన్స్ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మెషీన్ లెర్నింగ్ బయోఇంజినీరింగ్ టెక్నిక్స్ మరియు ఆటోమేషన్ వంటి టెక్నాలజీ ముసుగులో జరుగుచున్న  అణుయుద్ధాలు , రసాయనఆయుధాల దాడి, సూక్ష్మజీవులతో దాడి ( బయోవార్) సైబర్ దాడి ,  ఫుడ్ టెర్రరిజం , అగ్రో టెర్రరిజం వల్ల  వర్తమాన భవిష్యత్తులో పర్యావరణానికి మానవాళికి పెనుప్రమాదం పొంచి ఉంది. పర్యావరణ సానుకూల నిర్ణయాలలో  ప్రపంచ దేశాల్లో భారత్ పర్యావరణ దార్శనికత మహోన్నతమైనది  ఉంది  .

 

భారతపర్యావరణ వ్యూహాత్మక గమనాలు :

భారతీయులు అనాది నుండి ప్రకృతి ప్రేమికులు .  వేదకాలం నుండి  మానవులు  ప్రకృతితో విలీనమై   సామరస్యంగా జీవించేవారు . ప్రకృతిలోని  మొక్కలను , జంతువులను  అగ్ని నీరు గాలి భూమి లను దేవతలకు సింభాలిక్ గా భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడేవారు . అధర్వణ వేదంలో పర్యావరణ పరిరక్షణ గురించి... “ మాతా భూమి పుత్రోహం పృధ్వి వ్యా: పర్జ్యన్య : “ అని పేర్కొనబడింది .  పర్యావరణానికి హాని కలిగించవద్దు నీరు మరియు వృక్షజాలానికి హాని కలిగించవద్దు , భూమి నా తల్లి నేను ఆమె పుత్రున్ని జలాలు తాజాగా ఉండు గాక , చెట్లను నరికివేయవద్దు ఎందుకంటే అవి కాలుష్యాన్ని తొలగిస్తాయి అని చక్కగా  వివరించబడింది . భూమి మనది కాదు మనం భూమికి చెందిన వాళ్ళం అనే పర్యావరణతాత్విక నీతితో  ఆనాటి నుండి మానవుడు    ప్రకృతిని కాపాడుచున్నాడు  . ప్రాచీన మద్య యుగాలలో పర్యావరణ పరిరక్షణ భావనాత్మక అంశంగా ఉండేది . కానీ  ఆధునిక యుగంలో పారిశ్రామిక విప్లవం తరువాత  సాధనాత్మక అంశంగా మారింది . ఈ క్రమంలో మన భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు వాతావరణ మార్పులు కాలుష్యం వనరుల దుర్వినియోగంవంటి సవాళ్ళను ఎదుకోర్కొనేందుకు   అనేక వినూత్న పర్యావరణ చట్టాలు వ్యూహాత్మక  కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల్లో ముందున్నది   . భారత పర్యావరణ పరిరక్షణచట్టం- 1986 జల కాలుష్యనివారణ చట్టం- 1974 జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం- 1983 లతో పాటు  ఎకోమార్క్- 1991   నేషనల్ గ్రీన్ కార్ప్- 2001    మంగ్రోవ్స్ ఫర్ ది ఫ్యూచర్- 2006  నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్- 2010 నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్-2013  స్వచ్చ భారత్ అభియాన్- 2014  జలజీవన్ మిషన్- 2019 అటల్ భూజల్ యోజన- 2019  పిఏం కుసుమ్- 2019  పిఏం మత్స్య సంపద యోజన- 2019  నగర వన్ యోజన- 2020   అమృత్ ధరోహర్ యోజన- 2023 జాతీయ గ్రీన్ హైడ్రోజన్  మిషన్ - 2023    పియం  ప్రాణం -2023  మిషన్ లైఫ్-  2022 గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం -2023  నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం -2023 పియం  సూర్య ఘర్ యోజన-2024   మిష్టి ప్రోగ్రాం- 2025    న్యూక్లియర్ ఎనర్జీ మిషన్- 2025 తదితర  జాతీయ  పర్యావరణ అవిష్కరణలతో   భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యవంతమైన హరిత భారతం ( గ్రీన్ ఇండియా ) ను  అందించడం కొరకు కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు  కృషిచేయుచున్నవి  . ఇందుకు ప్రజలలో విద్యార్థులలో హరితపర్యావరణవాదాన్ని ( గ్రీన్ ఎన్విరాన్మెంటలిజం )  బలంగా పెంపొందించవలసిన అవసరం ఉంది  .         

 

 

హరితపర్యావరణవాదమే శ్రేయస్కరం :

ప్రజలలో పర్యావరణనీతి పర్యావరణవిలువ  భూవినియోగవిచక్షణ  జీవవైవిధ్యం జీవావరణం  జీవాసక్తి ( బయోఫిలియా ) భావనలను పెంపొందించే సమ్మిలిత ప్రయత్నమే పర్యావరణవాదం .     మానవుడు ప్రకృతిని జయించాలనే పేరుతో పర్యావరణవిధ్వంసానికి  పాల్పడటమంటే తాను కూర్చున్న కొమ్మను తానే  నరుక్కోవడమే అవుతుంది . కనుక పర్యావరణ పరిరక్షణకు   వాయు కాలుష్యాన్ని నివారించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి . హరితహారం  ట్రీమిత్ర ట్రీహగ్గింగ్ వంటి  కార్యక్రమాల ద్వార చెట్లను విరివిగా పెంచాలి. పరిశుభ్రమైన పరిసరాలు మరియు పర్యావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి  కమ్యునిటీ క్లీన్ –అప్  కార్యక్రమంలో ప్రజలు నిరంతరం పాల్గొనాలి . త్రీ ఆర్స్ (తగ్గించడం , పునర్వినియోగం చేయడం , రీసైకిల్ చేయడం) సూత్రాన్ని అనుసరించాలి .  ప్రతి వ్యక్తి పర్యావరణ జీవనశైలిలో భాగం కావాలి. ప్రజలకు విద్యార్థులలో  పర్యావరణ అక్షరాస్యత ద్వార హరితపర్యావరణవాదాన్ని  పెంచాలి . స్థానికత మరియు స్థానిక జీవన సంస్కృతులను పరిగణనలోకి తీసుకోవాలి. పౌరులందరూ " ప్రపంచంగా ఆలోచించండి - స్థానికంగా వ్యవహరించండి" అనే పదాలకు కట్టుబడి ఉండాలి . భూమిని ప్రకృతిని మరియు పర్యావరణాన్ని రక్షించడంలో విజ్ఞత మరియు విచక్షణను పాటించడం వల్ల  పర్యావరణ సంక్షోభాన్ని నివారింఛి హరిత ప్రపంచాన్ని నిర్మించగలం    .

 

రచయిత:

డాక్టర్ భారత రవీందర్ 

Comments

Popular posts from this blog

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

"జపాన్ బాబా వంగా" భవిష్యవాణి ప్రపంచాన్ని ఎందుకు కదిలించింది? I Why the “Japan’s Baba Vanga” Prediction Shook the World ? I Bharatha Sudarshan, Socio-Political Analyst

"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?